రహదారుల అభివృద్ధికి రూ.30 వేల కోట్లతో పనులు.. మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ జిల్లాలో నేడు నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు
Minister


నల్గొండ, 11 అక్టోబర్ (హి.స.)

నల్గొండ జిల్లాలో నేడు నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నల్గొండ నియోజకవర్గంలో రహదారి సౌకర్యాల మెరుగుదలకు రూ.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు డబుల్ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్తో కలిసి మంత్రి కోమటిరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కనగల్ మండలం తేలకంటిగూడెం, ఎస్. లింగోటం గ్రామాల్లో తేలకంటిగూడెం నుంచి తొరగల్లు, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.41 కోట్లతో, ఎస్.లింగోటం రోడ్డు నుంచి చెట్లచెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.33 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఈ రెండు రోడ్ల నిర్మాణంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమై, రహదారి అనుసంధానం మెరుగుపడుతుందని తెలిపారు. రోడ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటు రైస్ మిల్లులు, పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.30 వేల కోట్లతో పనులు చేపడుతున్నామని, నల్గొండ నియోజకవర్గంలోనూ గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande