
ఖమ్మం, 11 అక్టోబర్ (హి.స.)
గత ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకం ఏదైనా ఉందంటే అది కళ్యాణలక్ష్మి పథకమని అందుకే ప్రజలకు ఉపయోగపడే పథకం కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఎల్నినో కారణంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తాగునీరు, కరెంట్ సమస్య తీవ్రంగా ఎదురవుతుందని, ప్రమాదం అంచున ఉన్నామని తెలిపారు.
ముఖ్యంగా విద్యుత్ కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో యూనిట్ కరెంట్ 7 రూపాయలకు దొరికిందని ప్రస్తుతం యూనిట్కి 15 రూపాయలు పెట్టి కొనాలన్నా, ఏ ప్లాట్ ఫామ్లోనూ కరంట్ అందుబాటులో లేదన్నారు. రైతన్నలు మొదటి పంటను వేసి ఇబ్బంది పడకుండా, ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మొదటి పంటను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..