
మెదక్, 13 అక్టోబర్ (హి.స.) భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో వర్షపాతం పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల లభ్యత, ప్రత్యామ్నయ పంటల సాగు, విత్తనాల సరఫరా, వ్యవసాయ, విద్యుత్తు, మంచినీటి తదితర రంగాలపై ఎల్నినో ప్రభావం తదితర అంశాలపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సీజన్తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఎల్ నినో వల్ల భూగర్భజలాలు, చెరువులు, ఇతర నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా కంది, మొక్కజొన్న, పెసలు, మినుములు, శనగ, వేరుశనగ, సోయాబీన్, జొన్న, సజ్జ తదితర పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగు వైపు మళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు