
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.)
రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వారం రోజులుగా ఢిల్లీలో నిరసనల పేరిట వీరంతా కలిసి చేస్తున్న డ్రామాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యం పేరుతో పరమ అసహ్యంగా వ్యవహరిస్తూ, దేశ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, అజిత్ దోబల్, ఆర్ఎస్ఎస్ చీఫ్లను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ను కూలదోయడమే తమ లక్ష్యమని చెప్పడంలో తప్పు లేదేని, కానీ దానికోసం నైతిక విలువలను వదిలిపెట్టి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఈ ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా తీర్పులు రాలేదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా గద్దె దిగాలని అనడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేస్తున్న ఇలాంటి ధర్నాల వల్ల ఢిల్లీ మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నదని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..