
అమరావతి , 13 అక్టోబర్ (హి.స.)దర్శనంశ్రీశైల మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజైన మంగళవారం శ్రీ భ్రమరాంబికా అమ్మవారు 'చంద్రఘంటా దేవి' అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
శిరస్సుపై అర్ధచంద్రాకృతిలోని ఘంటను ధరించి, శాంతికి మరియు వీరత్వానికి ప్రతీకగా నిలిచే ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నలుమూలల నుంచి ఉదయం నుంచే భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ యాగశాలలో శాస్త్రోక్తంగా నవావరణ పూజలు, రుద్రయాగం, చండీయాగాలు కన్నులపండువగా నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆలయ ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుకుంట రమేష్ నాయుడు దంపతులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అర్చక బృందం పాల్గొని స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. రాత్రి వేళ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష వాహన సేవ నిర్వహించి క్షేత్ర వీధుల్లో ఊరేగించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్