
హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన జల వనరులను పొరుగు రాష్ట్రానికి తరలించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంపూర్ణంగా సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.
మీడియాతో మాట్లాడిన హరీశ్రావు, తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కృష్ణా మరియు గోదావరి జలాల వినియోగంలో మన వాటాను కాపాడుకోవడంలో రేవంత్రెడ్డి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపాదించే నీటి తరలింపు ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
గతంలో కేసీఆర్ నాయకత్వంలో నీటి బొట్టును కూడా వదలకుండా పోరాడి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించామని గుర్తుచేసిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల రాష్ట్రం మళ్లీ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ జల హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi