
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను, నీటిని ఆరాధించే అపురూపమైన సంస్కృతి మన తెలంగాణ సొంతమని ఆయన కొనియాడారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా సాగిన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగిసే ఘట్టం ప్రతి ఇంటా పండుగ కాంతులను నింపిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో తులతూగాలని గౌరమ్మను ప్రార్థిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రభుత్వం తరుఫున చెరువులు, కట్టలు మరియు ఘాట్ల వద్ద మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల విస్తృత ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పండుగ వేళ మహిళల రక్షణకు, ట్రాఫిక్ నివారణకు ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించామని పేర్కొన్నారు.
సమస్త ప్రజా సమూహానికి ప్రకృతి ప్రసాదించిన ఈ రంగురంగుల పూల పండుగ ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతీ ఒక్కరూ ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో ఈ సంబరాలను జరుపుకోవాలని ముఖ్యమంత్రి పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi