
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ నగర శివార్లలోని నాదర్గుల్లో గల ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో శనివారం రాత్రి అపశృతి చోటుచేసుకుంది. కళాశాలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న 'సంగమం-2026' సాంస్కృతిక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమం తీవ్ర విషాదాన్ని నింపింది. డాన్స్ చేస్తూ విద్యార్థులు ఆనందంలో మునిగిపోతున్న సమయంలో, వేదిక వద్ద అమర్చిన భారీ ఇనుప లైటింగ్ ట్రస్ అకస్మాత్తుగా కుప్పకూలింది.
ఈ దుర్ఘటనలో వనపర్తి జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని సోనీ ప్రాణాలు కోల్పోగా, ఆమె తోబుట్టువుతో సహా సుమారు 25 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీచిన బలమైన ఈదురుగాలుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్టాండ్ కూలిన సమయంలోనే చిన్నపాటి మంటలు కూడా చెలరేగడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు, సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రితో పాటు స్థానిక వైద్యశాలలకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi