
హైదరాబాద్ , 19 అక్టోబర్ (హి.స.)నగర రోడ్లపై దొంగ నంబర్ ప్లేట్లతో చక్కర్లు కొడుతున్న కేటుగాళ్లపై హైదరాబాద్ ట్రాఫిక్ నిఘా విభాగం పంజా విసిరింది. చట్టాన్ని బురిడీ కొట్టిస్తూ వాహనాల గుర్తింపును మార్చేస్తున్న సుమారు వంద మంది వాహనదారులపై పోలీసులు ఏకంగా క్రిమినల్ కేసులు బనాయించారు.
గడిచిన ఎనిమిది మాసాలుగా సిటీ వ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా సాగిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా.. నిబంధనలను బేఖాతరు చేసిన 100 వాహనాలను ఖాకీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన వాటిలో 88 బైకులు, 12 కార్లు ఉన్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ సోమవారం అధికారికంగా వెల్లడించారు.
ట్రాఫిక్ ఫైన్లు కట్టకుండా తప్పించుకోవడానికి, అలాగే నగరంలో నేరాలకు పాల్పడేందుకే కొందరు నంబర్ బోర్డులను చెరిపేయడం, నంబర్లను మార్చడం వంటి తిమ్మిని బమ్మిని చేసే పనులకు పాల్పడుతున్నట్లు ఖాకీల తనిఖీల్లో వెల్లడైంది. నిబంధనల ప్రకారం ప్రతీ వాహనానికి కేంద్రం గుర్తించిన హెచ్ఎస్ఆర్పీ (HSRP) ప్లేట్లు మాత్రమే ఉండాలని, నంబర్లపై పిచ్చి రాతలు రాసినా, నంబర్ ప్లేట్లను వంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దొంగ నంబర్లతో దొరికితే జరిమానాలతో సరిపెట్టకుండా, నేరుగా ఐపీసీ సెక్షన్ల కింద జైలు ఊచలు లెక్కపెట్టిస్తామని ట్రాఫిక్ విభాగాధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్