
శ్రీశైలం , 19 అక్టోబర్ (హి.స.)శ్రీశైల మహాక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (అక్టోబర్ 19, సోమవారం) 9వ రోజున శ్రీ భ్రమరాంబికా అమ్మవారు 'సిద్ధిధాత్రి' అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిస్తున్నారు. నవదుర్గ రూపాల్లో చివరిది, అత్యంత మహిమాన్వితమైనదిగా భావించే సిద్ధిధాత్రి అవతారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు భారీగా శ్రీశైలానికి తరలివచ్చారు.
ఈ పవిత్రమైన రోజున ఆలయంలో శ్రీ చక్రార్చన, నవావరణ పూజలతో పాటు శతా చండీ యాగం, సహస్ర చండీ పారాయణాలు అత్యంత నియమనిష్టలతో అర్చకులు నిర్వహిస్తున్నారు. భక్తుల కొంగుబంగారమై కోరిన కోరికలు తీర్చే భ్రమరాంబికా దేవి సిద్ధిధాత్రి రూపంలో సర్వసిద్ధులను, సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక వాహన సేవలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా ఏర్పాటు చేశారు.
ఆలయ ప్రాంగణం ఓం నమః శివాయ, జై భ్రమరాంబికా స్మరణలతో మారుమోగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైల దేవస్థానం అధికారులు, ట్రస్ట్ బోర్డు సకల సదుపాయాలు, ప్రత్యేక దర్శన మార్గాలు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్