
అమరావతి , 19 అక్టోబర్ (హి.స.)రాయచోటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ఇక్కడి విజయం ఒక సరికొత్త రికార్డు అని కొనియాడారు. పట్టణ పరిధిలోని మొత్తం 44 వార్డులనూ కూటమి ఏకపక్షంగా కైవసం చేసుకోవడం, అన్ని స్థానాలూ ఏకగ్రీవం కావడం స్థానిక రాజకీయ చరిత్రలోనే అపూర్వ ఘట్టమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయమై అమరావతిలో విలేకరులతో మాట్లాడిన మంత్రి, రాయచోటి గడ్డపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి పూర్తిగా కోల్పోయిందని ఎద్దేవా చేశారు. కనీసం నామినేషన్లు వేసి పోటీకి నిలబడేందుకు కూడా వైకాపాకు అభ్యర్థులు దొరకని దయనీయ స్థితి ఏర్పడిందని విమర్శించారు.
గడిచిన రెండున్నరేళ్లుగా స్థానిక ప్రజలను, వారి కష్టసుఖాలను పట్టించుకోని వైకాపా నేతలు.. ఇప్పుడు హడావుడిగా ఎన్నికల వేళ అభ్యర్థులను వెతికి బరిలోకి దించాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) శ్రీకాంత్ రెడ్డి గతంలో ప్రజలకు మొహం చాటేసి, ఇప్పుడు ఏ అర్హతతో ఓట్లు అడుగుతారని మంత్రి నిలదీశారు. ఏకగ్రీవమైన వార్డులతో సహా రాయచోటి పట్టణ పరిధిలోని ప్రతి ప్రాంత సమగ్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్