అమలాపురం పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఉద్రికత
అమలాపురం పురపాలక సంఘ కార్యాలయం నామినేషన్ల పరిశీలన వేళ రణరంగంగా మారింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల అర్హత పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చలాన్ల లొల్లి మొదలై తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిం
Tension


అమరావతి , 19 అక్టోబర్ (హి.స.)అమలాపురం పురపాలక సంఘ కార్యాలయం నామినేషన్ల పరిశీలన వేళ రణరంగంగా మారింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల అర్హత పత్రాలను అధికారులు తనిఖీ చేస్తుండగా, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చలాన్ల లొల్లి మొదలై తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యంగా 15వ వార్డు అభ్యర్థుల పత్రాల స్క్రుటినీ సమయంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నాయకులు పరస్పరం దాడులకు దిగేలా వ్యవహరించారు.

ఈ గొడవకు ప్రధాన కారణం నామినేషన్ల సాంకేతిక లోపాలను ఎత్తిచూపడమే. టీడీపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థికి సంబంధించి రూ.1,000 ట్రాఫిక్ బైక్ చలాన్ పెండింగ్లో ఉందని, నిబంధనల ప్రకారం ఆ నామినేషన్ చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పత్రాన్ని వెంటనే తిరస్కరించాలని మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

దీనికి ఏమాత్రం తగ్గని టీడీపీ శ్రేణులు కూడా దీటుగా స్పందించాయి. స్వయంగా వైసీపీ అభ్యర్థి చంద్రశేఖరే మున్సిపాలిటీకి రూ.61 వేల మేర పన్ను బకాయిలు పడ్డారని, అంత పెద్ద మొత్తంలో అప్పు ఉంచుకున్న వ్యక్తి నామినేషన్ను మొదట రద్దు చేయాలంటూ కౌంటర్ ఆందోళనకు దిగారు. ఈ వాదనలు కాస్తా ముదిరి ఇరుపక్షాలు కార్యాలయం లోపలే ఒకరినొకరు నెట్టుకుంటూ తోపులాటకు దిగారు. గందరగోళం మిన్నంటడంతో మున్సిపల్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. చివరకు సమాచారం అందుకున్న రక్షక భట నిలయ సిబ్బంది (పోలీసులు) భారీగా అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande