తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామం.. కాంగ్రెస్ నేతలకు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టను దెబ్బతీసేలా, కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మం
PoliticsPolitics


హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టను దెబ్బతీసేలా, కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ సోమవారం నోటీసులు జారీ చేసింది.

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ నోటీసులు పంపించారు.

ఇదే అంశంపై ఇప్పటికే వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు పంపించారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన సంబంధిత పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేసింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని, నోటీసులకు స్పందించని పక్షంలో పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని భారత రాష్ట్ర సమితి పార్టీ పంపిన నోటీసులలో హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande