
అనంతపురం, 05 అక్టోబర్ (హి.స.): ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురంలోని పలు గ్రామాల్లో వైరస్ పంజా విసురుతోంది. వైరస్ కారణంగా కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా కోళ్లు ఉన్నట్టుండి చనిపోతున్నాయి.
ఇలా 2,500 నాటుకోళ్లు మృతిచెందాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బర్డ్ఫ్లూ అనుమానంతో నమూనాలను భోపాల్లోని జాతీయ పరిశోధనా సంస్థకు పంపింది. కాగా, కోళ్ల మరణాలకు బర్డ్ఫ్లూనే కారణమని రాత్రి అక్కడి నుంచి నివేదిక అందింది. దీంతో ఈ రోజు ఉదయం గ్రామంలో చేరుకున్న పశుసంవర్ధక, వైద్య, రెవె న్యూ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు.
సిద్దరాంపురం గ్రామానికి చెందిన వెంకటరాముడు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద ఇటీవలే నాటుకోళ్ల ఫాం ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నుంచి నాటుకోళ్లు కొనగోలుచేసి తెచ్చారు. ఇటీవల ఫాంలోని కోళ్లు మృత్యువాత పడటం మొదలైంది. దీంతో అధికారులు.. శాంపిల్స్ను పరీక్షలకు పంపించి.. భోపాల్ ల్యాబ్ నుంచి నివేదిక అందిన నేపథ్యంలో అధికారులు బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందకుండా సిద్దరాంపురం చుట్టూ 10కి.మీ. పరిధిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు.
వ్యాధి సోకిన మూడు కోళ్ల ఫారాలను తక్షణమే సీజ్ చేసినట్టు చెప్పారు. ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అంతే కాకుండా కోళ్ల వ్యర్థాలు ఎక్కడా పారవేయవద్దని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV