
అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో అత్యంత అరుదైన మైలురాయిని తాకారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఏకంగా 25 సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రజాసేవను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనమైన అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా మోదీ నాయకత్వ పటిమను, దేశం కోసం ఆయన చేస్తున్న త్యాగాలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ సమావేశంలోనూ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై ప్రత్యేకంగా చర్చించి అభినందన తీర్మానాన్ని ఆమోదించారు. మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ రంగంలో ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలుస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు ఆదర్శప్రాయమని మంత్రులు ప్రశంసించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు, అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్