
హైదరాబాద్ , 07 అక్టోబర్ (హి.స.)దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సైబర్ నేరాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు అత్యంత వ్యూహాత్మకంగా ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ మరియు లోన్ యాప్ వేధింపుల కేసులను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్థులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ను చేపట్టారు. ఆరు వేర్వేరు రాష్ట్రాలలో ఏకకాలంలో ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో జరిపిన ఈ మల్టీ-స్టేట్ ఆపరేషన్లో ఏకంగా 101 మంది కరుడుగట్టిన సైబర్ నేరస్తులను అరెస్ట్ చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు.
ఈ ముఠాలు దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ట్రేడింగ్ యాప్ల ద్వారా వల వేసి, సుమారు రూ. 17 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల నుంచి భారీ ఎత్తున సెల్ఫోన్లు, లాప్టాప్లు, సిమ్ కార్డులు మరియు వందలాది నకిలీ బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలను అణచివేయడంలో తెలంగాణ పోలీసుల పనితీరును ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింక్లు లేదా యాప్లను నమ్మి మోసపోవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్