విజయవాడలో భారీ సైబర్ మోసం: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో కోటీ 44 లక్షలు స్వాహా
ఆంధ్రప్రదేశ్లోని వాణిజ్య రాజధాని విజయవాడలో సైబర్ నేరగాళ్లు మరోసారి తమ ప్రతాపం చూపారు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు ఇస్తామంటూ నమ్మబలికి ఓ అమాయక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఏకంగా రూ. 1.44 కోట్లు కాజేసిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
Cyber crime


అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని వాణిజ్య రాజధాని విజయవాడలో సైబర్ నేరగాళ్లు మరోసారి తమ ప్రతాపం చూపారు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు ఇస్తామంటూ నమ్మబలికి ఓ అమాయక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఏకంగా రూ. 1.44 కోట్లు కాజేసిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని వెటర్నరీ కాలనీకి చెందిన బాధితుడు కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఆన్లైన్ ట్రేడింగ్ ప్రకటనను చూసి స్పందించాడు. ఆ నిపుణుల సలహా మేరకు ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు.

ప్రారంభంలో సైబర్ కేటుగాళ్లు తమ యాప్లో బాధితుడికి భారీ లాభాలు వస్తున్నట్లు నకిలీ సంఖ్యలను చూపించారు. ఆ లాభాలను చూసి మరింత ఆశపడిన బాధితుడు విడతలవారీగా తన వద్ద ఉన్న సొమ్ముతో పాటు, అప్పులు చేసి మరీ నిందితులు చెప్పిన వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ. 1.44 కోట్లు జమ చేశాడు. ఆ తర్వాత తాను పెట్టిన పెట్టుబడిని, లాభాల నగదును విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, వెబ్సైట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాటు అదనంగా ట్యాక్సులు చెల్లించాలని మోసగాళ్లు డిమాండ్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande