ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బొనాంజా - రెండు డీఏల పెంపునకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దసరా పండుగ కానుకగా అదిరిపోయే శుభవార్త అందించింది.
Telangana govt


అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దసరా పండుగ కానుకగా అదిరిపోయే శుభవార్త అందించింది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న రెండు కరవు భత్యాలను (DA) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 2024 నుంచి పెండింగ్లో ఉన్న ఈ డీఏల పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇప్పటివరకు ఉన్న 33.67 శాతం డీఏను ఏకంగా 37.31 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ పెరిగిన కరవు భత్యం ఈ ఏడాది అక్టోబర్ నెల వేతనంతో కలిపి (నవంబర్లో చెల్లించే జీతం నుంచి) ఉద్యోగుల ఖాతాల్లో జమకానున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నట్లు ఈ నిర్ణయం మరోసారి నిరూపించింది. పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఇతర చిన్న సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande