
హైదరాబాద్ , 07 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) మరోసారి స్మగ్లర్ల అడ్డాగా మారుతున్నట్లు కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిరూపించాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇవాళ కస్టమ్స్ అధికారులు నిర్వహించిన నిత్య తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. తమిళనాడులోని తిరుచ్చి నుంచి హైదరాబాద్కు విమానంలో చేరుకున్న ఒక ప్రయాణికుడి కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు, ఆయన లగేజీని మరియు వ్యక్తిగత వస్తువులను అత్యంత క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో ఆ ప్రయాణికుడు తన వద్ద ఉన్న దుస్తులు మరియు ప్రత్యేక బాక్సులలో ఎలాంటి సుంకాలు చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టిన బంగారు బిస్కెట్లను అధికారులు గుర్తించారు. బయట మార్కెట్లో ఈ అక్రమ బంగారపు విలువ సుమారు రూ. 2.25 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా దేశంలోకి బంగారాన్ని రవాణా చేస్తున్న ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. విమానాశ్రయాల్లో ఇంటెలిజెన్స్ నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని, పసిడి స్మగ్లింగ్ మూలాలను ఛేదించేందుకు లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్