
అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో ప్రాంతీయ పార్ట్నర్షిప్ సదస్సు జరగనుంది. నవంబర్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రధాన పార్ట్నర్షిప్ సమ్మిట్కు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రాంతీయ సమావేశాల్లో ఇది మొదటిది. ఉత్తరాంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విశాఖలో నిర్వహించే సమావేశంలో ముఖ్యంగా పెట్టుబడుల అవకాశాలు, MSME రంగం అభివృద్ధి, సాంకేతికత, డీప్టెక్, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
విశాఖపట్నాన్ని టెక్నాలజీ, ఐటీ, డీప్టెక్, సముద్ర ఆధారిత పరిశ్రమలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ సదస్సు ప్రాధాన్యం కలిగిస్తోంది. ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెరిగితే స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కేవలం ఒకరోజు జరిగే సమావేశంగా కాకుండా నవంబర్లో జరగనున్న ప్రధాన భాగస్వామ్య సదస్సుకు ముందస్తు వేదికగా భావిస్తున్నారు. అక్టోబర్ 7 నుంచి 26 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఐదు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రతి ప్రాంతంలో అక్కడి ప్రత్యేక పరిశ్రమలు, పెట్టుబడి అవకాశాలపై దృష్టి పెట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్