
అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసుకు సంబంధించి వైయస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించి అత్యంత కీలకమైన ఆదేశాలను న్యాయస్థానం జారీ చేసింది. ట్రయల్ కోర్టు (విచారణ కోర్టు) జడ్జి స్వయంగా లేఖ రాస్తేనే ఈ బెయిల్ అంశాన్ని తదుపరి పరిశీలనకు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
గతంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం అనేకమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ఆయన బెయిల్ కోరడం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయంతో అనంతబాబుకు మరోసారి నిరాశ ఎదురైంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితుడికి తగిన శిక్ష పడేలా న్యాయ పోరాటం చేస్తామని బాధిత కుటుంబం తరఫు న్యాయవాదులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్