
హైదరాబాద్ , 07 అక్టోబర్ (హి.స.)తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను సుందరీకరించే పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో వెలసిన ప్రసిద్ధ చారిత్రక ఓంకారేశ్వర ఆలయ సమగ్ర అభివృద్ధికి మరియు ఆ ప్రాంతంలో భారీ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ. 1,108 కోట్లను భారీ బడ్జెట్గా కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
మూసీ నది ప్రవాహ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ భారీ ప్రాణాళికకు రూపకల్పన చేసింది. ఈ నిధులతో ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణాన్ని విస్తరించి, భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించనున్నారు. అలాగే, ఆలయానికి రాకపోకలు సాగించే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అత్యాధునిక హంగులతో ఆరు వరుసల రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ అభివృద్ధి పనుల ద్వారా మంచిరేవులు ప్రాంతం భవిష్యత్తులో ప్రధాన ఆధ్యాత్మిక మరియు పర్యాటక హబ్గా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్