
హైదరాబాద్ , 07 అక్టోబర్ (హి.స.)తెలంగాణ అసెంబ్లీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఆరోపణల వ్యవహారంలో విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. తనపై వస్తున్న వివిధ ఆరోపణలు మరియు ఫిర్యాదులకు సంబంధించి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కోరిన వివరణకు అనుగుణంగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన సమాధానాన్ని అధికారికంగా అందజేశారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎథిక్స్ కమిటీకి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ పత్రాన్ని ఆయన సీల్డ్ కవర్లో ఉంచి కమిటీకి పంపించారు.
గతంలో సభలో మరియు బయట చోటుచేసుకున్న పరిణామాలు, తనపై ప్రత్యర్థులు చేసిన నిరాధార ఆరోపణలకు గల వాస్తవాలను ఆ లేఖలో స్పష్టంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది. శాసనసభ్యుడిగా నిబంధనలకు లోబడి తాను ఎప్పుడూ ప్రవర్తించానని, తనపై వస్తున్న విమర్శలలో ఎలాంటి నిజం లేదని ఆయన ఆ వివరణలో పేర్కొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పంపిన ఈ సీల్డ్ కవర్ లేఖను పరిశీలించిన ఎథిక్స్ కమిటీ త్వరలోనే సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్