
అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలు స్థానిక గ్రామాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. తుపాకులగూడెం, గజ్జరం, భీమోలు, గోపవరం తదితర ఏజెన్సీ మరియు గ్రామీణ ప్రాంతాల పరిధిలో పెద్దపులి అడుగుజాడలను స్థానికులు గుర్తించడంతో అటవీశాఖ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. సమీపంలోని అడవుల నుంచి పులి జనావాసాల వైపు వస్తున్నట్లు వస్తున్న సంకేతాలతో ప్రజలు ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
సంఘటనా స్థలాలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు, పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక సీసీ కెమెరాలను, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఎవరూ పొలాలకు మరియు అడవుల వైపు వెళ్లవద్దని దండోరా ద్వారా మైకులతో ప్రచారం నిర్వహించారు. అటవీ జంతువుల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచించారు. పులిని సురక్షితంగా దట్టమైన అడవుల్లోకి తరిమేందుకు అవసరమైన అన్ని చర్యలను రెస్క్యూ టీమ్లు ముమ్మరం చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్