
హైదరాబాద్ , 07 అక్టోబర్ (హి.స.)రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తమ ద్విచక్ర వాహనంపై (బైక్) ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక గుర్తుతెలియని భారీ వాహనం వారి బైక్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు బైక్పై ఉన్న భార్య, భర్త మరియు వారి చిన్న కుమారుడు ముగ్గురూ రోడ్డుపై ఎగिరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, చేవెళ్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనతో మృతుల కుటుంబంలో తీవ్ర ఆర్తనాదాలు మిగిలాయి. కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్