ఏకగ్రీవ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు.. నగదు బహుమతులను పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు అందించే ప్రోత్సాహక నగదును గణనీయంగా పెంచింది.
Ap government


అమరావతి , 13 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు అందించే ప్రోత్సాహక నగదును గణనీయంగా పెంచింది. గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా పోటీలు, విభేదాలు తగ్గించి, ఐక్యతతో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది.

కొత్తగా నిర్ణయించిన ప్రోత్సాహకాల ప్రకారం.. 5 వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే రూ.15 లక్షలు అందజేయనున్నారు. 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా కలిగిన పంచాయతీలకు రూ.25 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఇక 10 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఏకంగా రూ.50 లక్షలు అందించనున్నారు.

జనాభా ప్రాతిపదికన మూడు విభాగాలుగా ప్రోత్సాహకాలను ఖరారు చేయడం ద్వారా అన్ని స్థాయిల గ్రామ పంచాయతీలకు ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులను గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలపై ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande