
న్యూఢిల్లీ , 14 నవంబర్ (హి.స.)
భారత్‌లో రానున్న కాలంలో తీవ్ర ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత్‌ను అధిక ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో చేర్చి, గ్రేడ్-3 అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు పేర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా దేశంలో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగితే వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. దీనివల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడవచ్చని, పంటల దిగుబడులు తగ్గి ఆహార కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, నీటి కొరత, ఇతర వాతావరణ సంబంధిత అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్