
అమరావతి , 14 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 20న జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. ఈ నెల 19న మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు జరగనున్నాయని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. జడ్పీ ఛైర్పర్సన్లు, ఎంపీపీల ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలను ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఐదేళ్లపాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పల్నాడు నుంచి రాయలసీమ వరకు కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సమస్యాత్మకంగా ఉన్న 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా చర్చించి, ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు.
నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసుల సహకారం అందిస్తామని పేర్కొన్నారు. తమకు దాడుల ముప్పు ఉందని ఎస్పీల దృష్టికి తీసుకెళ్తే అవసరాన్ని బట్టి ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్