
హైదరాబాద్ , 13 నవంబర్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నట్లు సమాచారం.
ఎల్నినో పరిస్థితుల కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా వర్షపాతం తగ్గడం, కరువు పరిస్థితులు ఏర్పడటం, పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడటం వంటి సమస్యలు తలెత్తితే రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించాలని, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలను కూడా భేటీలో ప్రస్తావించే అవకాశం ఉంది.
ప్రధానితో జరిగే ఈ సమావేశం ద్వారా తెలంగాణకు కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లభిస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్