
విశాఖపట్నం, 13 నవంబర్ (హి.స.)
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కూడా పెట్టుబడుల ప్రకటనలతో కొనసాగుతోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ పారిశ్రామిక సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పలు కంపెనీలు, ప్రభుత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి.
ఈ సందర్భంగా మొత్తం రూ.1.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 12 ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్డీఏ), ఏపీ మారిటైమ్ బోర్డు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగాలతో పాటు పీ4 కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఇందులో ఉన్నాయి. వివిధ రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ పెట్టుబడులు మార్గం సుగమం చేయనున్నాయి. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. సీఐఐ సదస్సు ద్వారా ఏపీని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్