
అమరావతి , 13 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. తొలి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 17వ తేదీలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన అనంతరం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ వంటి ప్రక్రియలను ఎన్నికల అధికారులు చేపట్టనున్నారు.
ఈ నెల 26న పోలింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అనంతరం ఫలితాలను వెల్లడించి విజేతలను ప్రకటించనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలవడంతో ఆశావహులు తమ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల కోసం పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ల దాఖలుపై దృష్టి సారిస్తున్నారు. తొలి విడత ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్