
హైదరాబాద్ , 13 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట విద్యార్థులు మహాధర్నా నిర్వహిస్తూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నిలిపివేసిన విద్యుత్, నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
హాస్టళ్లలో మెస్లను తిరిగి ప్రారంభించి విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించాలని కోరారు. ప్రాథమిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా యూనివర్సిటీలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది కొరత కారణంగా విశ్వవిద్యాలయ కార్యకలాపాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు, పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలపై యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్