
అమరావతి , 14 నవంబర్ (హి.స.)బాపట్లలో భారతీయ జనతా పార్టీ నాయకుల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. బాపట్ల మున్సిపాలిటీలో చైర్పర్సన్ పదవికి పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలు, అభ్యర్థుల అర్హతలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా మాధవ్ పార్టీ నాయకులతో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక నాయకుల అభిప్రాయాలతో పాటు పార్టీ శ్రేణుల మనోభావాలను కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే ముందు పార్టీ అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతామని మాధవ్ వెల్లడించారు. హైకమాండ్‌తో చర్చలు పూర్తయిన అనంతరం చైర్పర్సన్ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంతో బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్