ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో కేటీఆర్ కీలక సమావేశం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో సమావేశమయ్యారు.
BRS


హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమంపై ప్రధానంగా చర్చించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంపై నేతలతో కేటీఆర్ సమీక్షించారు.

2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను అరెస్టు చేసిన అలుగునూర్ ప్రాంతంలోనే ఈసారి దీక్షా దివస్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 29న బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది కూడా అలుగునూర్ వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ స్వయంగా హాజరుకానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంతో దీక్షా దివస్ నిర్వహణకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande