
అమరావతి , 14 నవంబర్ (హి.స.)రాష్ట్రంలో తప్పిపోయిన, అదృశ్యమైన పిల్లలకు సంబంధించిన కేసుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కేసుల దర్యాప్తు, సమన్వయం, సమీక్షతో పాటు నిరంతర పర్యవేక్షణ చేపట్టేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలు అదృశ్యమైన ఘటనలను తీవ్రంగా పరిగణించి, ఆయా కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసేలా ఈ కమిటీలు పనిచేయనున్నాయి. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచడం ద్వారా తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ గుర్తించేందుకు చర్యలు తీసుకోనున్నారు. నమోదైన కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, దర్యాప్తులో ఎదురవుతున్న సమస్యలను సమీక్షించి అవసరమైన సూచనలు చేయనున్నారు.
జిల్లా స్థాయిలో నమోదయ్యే కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, వాటి వివరాలను రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదించేలా వ్యవస్థను రూపొందించనున్నారు. తద్వారా కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించి, బాధిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అదృశ్యమైన పిల్లలను సురక్షితంగా గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించడమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్