కాంగ్రెస్పై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు
ఎన్నికల సంఘం (ఈసీ), సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించేలా ఉన్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
Etala


హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)

ఎన్నికల సంఘం (ఈసీ), సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించేలా ఉన్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రాహుల్గాంధీ చివరకు దేశ సైనికులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని కించపరుస్తున్నారని మండిపడ్డారు. దేశంలో గతంలో ఉన్న ఈసీ, సుప్రీంకోర్టు వ్యవస్థలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అలాంటప్పుడు ఇప్పుడు వాటిపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు.

భారత్ను ప్రపంచ వేదికపై గర్వంగా నిలిపిన నాయకుల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ ఒకరని ఈటల గుర్తుచేశారు. పార్లమెంటును అవమానిస్తూ, దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని విపక్షాలు ఆరోపించడం సరికాదన్నారు. నెహ్రూ కాలం నుంచి భారత్ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమని చెబుతున్నారని, ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలో అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. జీపుల కొనుగోళ్ల వ్యవహారం నుంచి 2జీ, బొగ్గు కుంభకోణం, బోఫోర్స్ వరకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయని విమర్శించారు. అవినీతి రహిత పాలనతో దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈటల పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande