
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.) అమలు
గిగ్ కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఆన్లైన్ డెలివరీ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న సుమారు ఆరు లక్షల మంది కార్మికులకు ఈ చట్టం ద్వారా ప్రయోజనం కలగనుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త చట్టం ప్రకారం గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిధి ద్వారా కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమాతో పాటు వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు వారికి అండగా నిలిచేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు.
చట్టం అమలులో భాగంగా డెలివరీ, క్యాబ్ సేవలు అందించే అగ్రిగేటర్లు, ఆన్లైన్ ప్లాట్ఫాం సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా సంస్థలు 45 రోజుల్లోగా సంబంధిత సంక్షేమ బోర్డు వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆదేశించింది. అలాగే నమోదు చేసుకున్న ప్రతి గిగ్ కార్మికుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. తద్వారా కార్మికుల వివరాలను నమోదు చేసి, వారికి అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలను పారదర్శకంగా చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్