గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు.. గుర్తింపు కార్డులు: సీఎం రేవంత్ రెడ్డి
గిగ్ వర్కర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy


హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)

గిగ్ వర్కర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కష్టపడి పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు తగిన ఆదాయం, చట్టపరమైన రక్షణ, సామాజిక భద్రత అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ప్రజా పాలనలో గిగ్ వర్కర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

ఆ హామీ మేరకు ఇప్పుడు గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ చట్టాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ సంక్షేమ పథకాన్ని గిగ్ వర్కర్లకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పథకం కింద ప్రతి గిగ్ వర్కర్కు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య చికిత్స అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. వారి హక్కులను కాపాడటంతో పాటు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande