
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక 'అభయ హస్తం'లో అనేక అసత్య హామీలు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా బీసీల సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు కనీసం రూ.5 వేల కోట్లు కూడా కేటాయించలేదని కేటీఆర్ విమర్శించారు. బీసీల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. అలాగే అభయ హస్తం పథకం కింద అర్హులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఆ హామీ అమలులో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు.
ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పక్కన పెట్టిందని విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం, అమలు చేయని వాగ్దానాల జాబితా చాలా పెద్దదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్