
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)
దేశంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టి, యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడే లక్ష్యంతో హైదరాబాద్‌లో 'నషా ముక్త్ భారత్' యాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ యాత్రకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నాయకత్వం వహించనున్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
యాత్ర నిర్వహణకు సంబంధించి ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో మేధావులతో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటోందని, ఈ సమస్యను సమాజమంతా కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చించారు.
డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా పాల్గొన్నవారంతా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మూడు రోజుల యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్