నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పిస్తాం: ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, పెండింగ్లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా సమీక్ష నిర్వహించారు.
Election commission


అమరావతి , 14 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, పెండింగ్లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా సమీక్ష నిర్వహించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా పల్నాడు నుంచి రాయలసీమ వరకు పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

సమస్యాత్మకంగా గుర్తించిన 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేకంగా మాట్లాడి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల సమయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్ కోరితే ఏర్పాటు చేస్తామని, దాడుల ముప్పు ఉన్నట్లు సంబంధిత ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ప్రత్యేక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ప్రకటించినట్లు తెలిపారు. ఐదు వేల వరకు జనాభా ఉన్న గ్రామాలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న గ్రామాలకు రూ.25 లక్షలు అందనున్నాయని వివరించారు. రాష్ట్రంలో 15 నుంచి 20 శాతం గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande