రాహుల్ గాంధీ పర్యటన వేళ పలువురు నేతలకు గృహ నిర్బంధం
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఆయన పర్యటనను అడ్డుకుంటామని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
TELANGANA police


హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఆయన పర్యటనను అడ్డుకుంటామని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించడం ఏమిటని బీజేవైఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. హామీల అమలుపై సమాధానం చెప్పిన తర్వాతే రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ చేస్తూ ఆయన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిరసనలకు అవకాశం లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

మరోవైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సికింద్రాబాద్లోని తార్నాకలో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. రాహుల్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande