
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించి కీలక కార్యక్రమం ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి గిగ్ వర్కర్ల కోసం రూపొందించిన ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది.
డెలివరీ సిబ్బంది, ఆన్లైన్ సేవల ద్వారా పనిచేస్తున్న ఇతర గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రమాదాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య రక్షణ వంటి అంశాల్లో వారికి అండగా నిలవడం ఈ పథకం లక్ష్యంగా ఉంది. గతంలో గిగ్ వర్కర్లతో సమావేశమైన సమయంలో రాహుల్ గాంధీ వారి సమస్యలను తెలుసుకుని సంక్షేమానికి హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీని అమలు చేసే దిశగా పథకాన్ని ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్