
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమంపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
నగరంలోని శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గిగ్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలు, హక్కులపై ప్రభుత్వం దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ర్యాలీ ముగిసిన అనంతరం జయభేరి గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలపై నేతలు ప్రసంగించనున్నారు. ముఖ్యంగా గిగ్ కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించే నూతన చట్టాన్ని రాహుల్ గాంధీ సభా వేదికగా విడుదల చేయనున్నారు.
మరోవైపు ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్