
హైదరాబాద్ , 14 నవంబర్ (హి.స.)గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గతంలో గిగ్ వర్కర్లతో సమావేశమైనప్పుడు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నానని గుర్తు చేశారు. అప్పట్లో వారి సంక్షేమం కోసం ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామని తెలిపారు.
గిగ్ వర్కర్లకు ఇప్పటివరకు సరైన గుర్తింపు, వారి పని వివరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదని రాహుల్ పేర్కొన్నారు. కొత్తగా తీసుకొస్తున్న చట్టం ద్వారా వారి పని గంటలు, శ్రమ, డెలివరీలు, వాటికి లభించే ప్రతిఫలం వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సమాచారమంతా నేరుగా వారి మొబైల్ ఫోన్లోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
గిగ్ వర్కర్లు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సమాజానికి సేవలు అందిస్తున్నారని, వారి కష్టానికి తగిన గుర్తింపు, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు. కార్మికుల హక్కులను కాపాడటంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్