మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సీబీఐ ఉక్కుపాదం: ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో భారీ సోదాలు
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సీబీఐ ఉక్కుపాదం: ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో భారీ సోదాలు
CBI


న్యూఢిల్లీ, 14 నవంబర్ (హి.స.)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్ ‘మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్’ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.ఈ అక్రమ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని కూల్చివేసే దిశగా గత కొద్ది రోజులుగా ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా ప్రత్యక్షంగా నడుస్తున్న పలు బెట్టింగ్, జూదపు ప్యానెళ్లను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు.సోదాల్లో భారీ ఎత్తున డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, మ్యూల్ (నకిలీ/అద్దె) బ్యాంకు ఖాతాలు, హవాలా మార్గాల వినియోగాన్ని రుజువు చేసే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను ఒమన్ నుంచి భారత్‌కు రప్పించి నవంబర్ 1న అరెస్ట్ చేసిన సీబీఐ, రాయ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు అనుమతితో ఎనిమిది రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది.విచారణలో చంద్రకర్ వెల్లడించిన కీలక సమాచారం ఆధారంగా అమృత్‌సర్, ఢిల్లీ, నాగౌర్, ధోల్‌పూర్, భోపాల్, రాయ్‌పూర్, దుర్గ్, ఇండోర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, ముంబై, నాగ్‌పూర్ నగరాల్లో ఈ దాడులు జరిగాయి.సోదాల్లో లభించిన ఆధారాలను చంద్రకర్ ముందుంచి ప్రశ్నించిన అనంతరం, నవంబర్ 12న కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి నవంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

విదేశాల్లోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ బెట్టింగ్ నెట్‌వర్క్ నడుస్తోందని, భారత్‌లోని ప్యానెల్ ఆపరేటర్ల ద్వారా కస్టమర్ ఐడీలను నిర్వహిస్తూ ఇతరుల పేర్లపై తెరిచిన లేదా అద్దెకు తీసుకున్న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వసూలు చేసి హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన సీబీఐ, ఇతరులకు తమ బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు లేదా గుర్తింపు పత్రాలను అద్దెకు ఇవ్వడం తీవ్ర నేరమని, అలాంటి వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలను హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande