ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం: 400 దాటిన AQI, రంగంలోకి CAQM
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం: 400 దాటిన AQI, రంగంలోకి CAQM
delhi


న్యూఢిల్లీ, 14 నవంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీని మరోసారి విషపూరిత పొగమంచు కమ్మేసింది.నగరంలో వాయు నాణ్యత మరింత క్షీణించి 'తీవ్ర' (Severe) స్థాయికి చేరుకోవడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం, ఢిల్లీలోని దాదాపు 33 పర్యవేక్షణ కేంద్రాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటి 419 వద్ద నమోదైంది. ముఖ్యంగా ఎయిమ్స్ (AIIMS) పరిసర ప్రాంతాలతో పాటు పలు కీలక కూడళ్లలో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో దృశ్యమానత తగ్గి వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

చలి తీవ్రత పెరగడం, గాలి వేగం మందగించడంతో పాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల (పరాలీ) దహనాలు పెరగడం ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణమవుతోంది.దీనితో పాటు వాహనాల ఉద్గారాలు, పరిశ్రమల కాలుష్యం తోడవడంతో పరిస్థితి మరింత విషమించింది.కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మూడో దశ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. దీని కింద అత్యవసరమైనవి మినహా ఇతర నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు.

మరోవైపు, పంట వ్యర్థాల దహనాలను నియంత్రించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై CAQM కఠిన వైఖరి అవలంబిస్తోంది.పంజాబ్‌లోని ఫాజిల్కా, జలంధర్, ఫరీద్‌కోట్ సహా పలు జిల్లాల ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో తక్షణమే తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. కాలుష్యం బారి నుంచి రక్షించుకోవడానికి చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande