
హైదరాబాద్ , 15 నవంబర్ (హి.స.)
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నల్గొండలో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మహాసభల తొలిరోజు రైతులతో భారీ ప్రదర్శన చేపట్టడంతో పాటు బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.
ఈ జాతీయ స్థాయి సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులు, రైతుల హక్కులు, సంక్షేమం వంటి అంశాలపై మహాసభల్లో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ కార్యక్రమానికి సీపీఎం సీనియర్ నాయకురాలు బృందా కారత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆమెతో పాటు పలువురు జాతీయ స్థాయి రైతు సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించనున్నారు.
మహాసభల నేపథ్యంలో నల్గొండలో రైతుల ప్రదర్శన, బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. రైతు సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్