
అమరావతి , 15 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో చిన్నారులు, కౌమార దశలో ఉన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా 10, 16 ఏళ్ల వయసున్న పిల్లలకు డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు టీకాలు వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానంగా డిఫ్తీరియా, ధనుర్వాతం వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఆయా వయసుల్లో అవసరమైన టీకాలను అందించడం ద్వారా భవిష్యత్తులో వ్యాధుల ముప్పును తగ్గించవచ్చని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.
టీకాల పంపిణీ కోసం పాఠశాలలను కేంద్రాలుగా ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ అర్హులైన విద్యార్థులకు టీకాలు అందించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయనున్నారు.
తమ పిల్లలకు టీకాలు వేయించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న వయసు నుంచే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు పిల్లలకు అదనపు ఆరోగ్య భద్రత కల్పించడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలవనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్