ఏపీకి మరో తుపాను ముప్పు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్కు మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Cyclone Murasu


అమరావతి , 15 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్కు మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా రూపాంతరం చెందవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ వ్యవస్థ మరింత బలపడి బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అనంతరం ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాల వైపు పయనించి తీరం దాటవచ్చని చెబుతున్నారు.

తుపాను ప్రభావంతో వచ్చే గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. గంటకు బలమైన వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తుపాను దిశ, తీవ్రతపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande